గత కొన్నాళ్లుగా సల్మాన్ ఖాన్‌ను హత్య చేస్తామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ బెదింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బిష్ణోయ్ జైలులో ఉన్నప్పటికీ అతని గ్యాంగ్ మాత్రం ఇదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో సల్మాన్‌ఖాన్‌కు గట్టి భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అతని ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. మరోపక్క సల్మాన్ పర్సనల్ సెక్యూరిటీ కూడా అప్రమత్తంగా ఉన్నారు. సల్మాన్ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో బిష్ణోయ్ గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ కేసులో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం అతన్ని కోర్టులో హాజరుపరుస్తారు.
ఈ ఏడాది ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి సల్మాన్ ఇంటిపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన విచారణ జరుగుతున్న తరుణంలోనే మరో నటుడిపై కూడా హత్యకు కుట్ర జరుగుతోందని పోలీసులు తెలియజేశారు. ఆ నటుడు తన ఇంటికి వెళ్లే దారిలో అతనిపై దాడి చేసేందుకు ప్లానింగ్ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అయితే సల్మాన్ ఖాన్ పరిస్థితి మాత్రం క్రిటికల్‌గా మారినట్టు తెలుస్తోంది. అందుకే ఇంతకుముందు కంటే భద్రత పెంచారు పోలీసులు.
తన ఇంటిపై జరిగిన కాల్పులకు సంబంధించి ఇప్పటికే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు సల్మాన్. ఘటన జరిగినరోజు ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, చుట్టు పక్కల ప్రాంతం ఎంత భయానకంగా మారింది అనే విషయాలను తెలియజేశారు సల్మాన్. అతను ఎదుర్కొంటున్న ఈ సమస్య పట్ల బాలీవుడ్ ఎంతో ఆందోళనలో ఉంది. ఈ కేసును పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సల్మాన్ హత్యకు స్కెచ్ వేస్తున్న వ్యక్తుల్ని పట్టుకోవడానికి పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారు.